హెల్మెట్ పెట్టుకోమని అడిగినందుకు ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల తలలు పగులగొట్టాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. దావణగేరికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి బైక్ పై బయలుదేరాడు. పైగా హెల్మెట్ ధరించకపోవడంతో అతడిని ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు. దాంతో ఆవేశంతో ఊగిపోయిన ఆ వ్యక్తి తననే ఆపుతావా అంటూ పోలీసులపై వాగ్వాదానికి దిగడమే కాకుండా రాళ్లతో వారి తలలు పగలగొట్టాడు. స్థానికులు అతడిని ఎంత ఆపినా ఆగకుండా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ్ రాజ్ , ఎఎస్ఐ అంజన్నలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.