తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ వెల్లడించారు. తాను ఇక నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని అతి త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఫిబ్రవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని వార్తలు వెలువడుతున్నందున రాజకీయం వేడెక్కినట్లేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోడం వలన అధికార టీడీపీ బలంగా మారుతుందని అన్నారు. ఇదిలావుంటే ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు విశాఖ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన రామకృష్ణ జగన్ తో విబేధాల కారణంగా ఆ పార్టీనుంచి బయటికి వచ్చేశారు. అయితే అప్పటినుంచి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను అభినందిస్తూ వస్తున్నారు. దాంతో అప్పట్లోనే ఆయన టీడీపీలోనే చేరాతరాని అనుకున్నారు. కానీ ఆయన చేరికకు విశాఖ జిల్లాకు చెందిన కీలక మంత్రి అడ్డుచెప్పినట్టు ప్రచారం జరిగింది. కానీ టీడీపీ అధిష్టానం కొణతాల విషయంలో జోక్యం చేసుకుందని త్వరలోనే ఆయనను పార్టీలోకి తీసుకుంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరి కొణతాల రామకృష్ణ ఆలోచన ఎలా ఉందొ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.