టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. సమావేశంలో ఎంపీలకు పార్లమెంట్ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ పీఎం మోడీ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను మోడీని మోడీగారు అని అస్పష్టంగా అన్నానని, మోడీ గాడు అని సంబోధించలేదని స్పష్టం చేశారు.
ఏ సభలో అయినా సరే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఇస్తున్నారు అంటే.. ఎవరినో ఒకరిని టార్గెట్ చేయకుండా వదలరు. అలాగే.. ఈ మధ్య ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ.. మోడీ గాడు అని అనేశారు. దీంతో.. బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా.. హైదరాబాద్ పర్యటనలో అసంతృప్తి తెలిపారు.
దీంతో కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన మంత్రి కేటీఆర్ , ఎంపీ కవిత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రధాని మోడీని అవమానించే విధంగా తన తండ్రి కేసీఆర్ మాట్లాడలేదని అన్నారు. అవమానించలేదని చెప్పుకొచ్చారు. మోడీ గారు.. అనే ప్రయత్నంలో.. అప్రయత్నంగా మోడీ గాడు అని వచ్చినట్టుగా వివరణ ఇచ్చుకున్నారు.
మొత్తంగా.. కేసీఆర్ చేసిన కామెంట్లతో బీజేపీ నేతలు బాగానే రాజకీయం చేస్తుండగా.. దాన్ని చల్లబరిచే రీతిలో.. సెంటిమెంట్ పండించేందుకు కేసీఆర్ పిల్లలు కవిత, కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. దీంతో… ముందు ఎందుకు నోరు జారాలి.. తర్వాత ఇలా ఎందుకు ఇబ్బంది పడాలి.. అని జనం అంటున్నారు.
ఇదిలా ఉంటే తాను చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ వివరణిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ- కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ అంటే పెద్దజోక్ అని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలకు అసహనం ఎక్కువ అని ...వాళ్ల ఒత్తిడిని ప్రజల ఒత్తిడిగా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతేకాదు తనతో పెట్టుకుంటే భస్మం అయిపోతారని సూచించారు. కావాలంటే ఒక్కసారి నన్నుముట్టుకొని చూడండి అంటూ సవాల్ విసిరారు.
మేం కడుపు నోరు కట్టుకొని పరిపాలన చేస్తున్నాం. తప్పులు చేసిన వారు భయపడొచ్చా. కానీ నేను భయపడను. కావాలంటే నా ఆస్తుల్నీ ఐటీ రిటర్న్స్ లో చూసుకోవచ్చు.