నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తుళ్లూరు మండలం నేలపాడులో నిర్మిస్తున్న సిటీ కోర్ట్స్ కాంప్లెక్స్ భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు నిన్న పరిశీలించారు. హైకోర్టు నిర్మాణాలపై ప్రధాన న్యాయమూర్తితో పాటు అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి తర్వాత అమరావతిలో ఏపీ హైకోర్టు ప్రారంభమవుతుంది. ఏపీ రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్మిస్తున్న సిటీ కోర్ట్స్ కాంప్లెక్స్ భవనాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించారు. జుడీషీయల్ కాంప్లెక్స్ వెలుపల, లోపల జరుగుతున్న పనులను మంత్రి నారాయణ దగ్గరుండి న్యాయమూర్తులకు చూపించారు. కోర్టు హాలు డిజైన్, జడ్జీల ఛాంబర్లు, న్యాయవాదుల కార్యాలయాలు, సమావేశ మందిరాలను నిశితంగా గమనించారు. జడ్జిలు, న్యాయవాదులు, ప్రజలు కోర్టులోకి వెళ్లే ప్రవేశ మార్గాలపై ఆరా తీసిన చీఫ్ జస్టిస్ బీ.రాధాకృష్ణన్ బృందం పలు సూచనలు చేసింది.
జ్యుడీషియల్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన డిజైన్‌లను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించారు. క్యాపిటల్ సిటీ, ఐకానిక్ భవనమైన హైకోర్టు డిజైన్లు, జ్యుడీషియల్ కాంప్లెక్స్‌కు సంబంధించిన విషయాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూశారు. జడ్జీల బంగ్లాల నిర్మాణ పనుల పరిశీలన సందర్భంగా వసతుల కల్పనపై వివరాలడిగి తెలుసుకున్నారు. క్యాపిటల్ సిటీ ఐకానిక్ భవనమైన హైకోర్టు డిజైన్లు, జ్యుడీషియల్ కాంప్లెక్స్‌కు సంబంధించిన విషయాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. జడ్జీల బంగ్లాల నిర్మాణ పనుల పరిశీలన సందర్భంగా వసతుల కల్పనపై వివరాలడిగారు. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాలపై ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగంవగా జరగుతున్నాయని మెచ్చుకున్నారు. అయితే హైకోర్టు విభజన కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని ఇందుకోసం నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంటుందని చెప్పారు.
అమరావతి పర్యటనకు వచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులను సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మాణాల పురోగతి గురించి వారు చర్చించారు. ముందు జిల్లా కోర్టులను పూర్తిచేసి వాటిని తాత్కాలిక హైకోర్టుకు ఉపయోగిస్తామని ఆ పనులు వచ్చే డిసెంబరు నాటికి పూర్తవుతాయని చంద్రబాబు వివరించారు. తాత్కాలిక భవనాలు పూర్తయిన వెంటనే హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఓ ఐకాన్ మాదిరిగా హైకోర్టు భవనాలను తయారు చేస్తామని అన్నారు. కొత్త సంవత్సరం నుండి ఏపి హైకోర్టు అమరావతి కేంద్రంగానే విధుల నిర్వహిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే హైకోర్టుకు జనవరి ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు సెలవులు ఉండంతో ఆ తర్వాతే తరలింపు జరుగుతుందని న్యాయ వర్గాల సమాచారం. జనవరి ఒకటో తేదీనాటికి కేంద్రం నోటిఫికేషన్ అందితే, సంక్రాంతి సెలవుల తర్వాత అమరావతి వేదికగా హైకోర్టు పనిచేయడం ప్రారంభమవుతుందని తెలుస్లోంది.