జనసేన కదం తొక్కనుంది. జనసైనికులు పవన్ అడుగులో అడుగు వేయనున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా.. జనసేనాని కాసేపట్లో భారీ కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధవళేశ్వరం బ్రిడ్జీపై జనసేన కవాతు జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం వరకు నిర్వహించనున్న ఈ కవాతు కోసం జనసేన సైనికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ కవాతులో 2 లక్షల మంది పవన్ అభిమానులు పాల్గొంటారని తెలుస్తోంది. స్థానికులతో పాటు.. వివిధ జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
ఇందుకోసం పవన్ కల్యాణ్ కాసేపట్లో బెజవాడ నుంచి పిచ్చుకలంకకు బయల్దేరి వెళ్లనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసిన జనసేన కార్యకర్తలు.. పవన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజాపోరాట యాత్రలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతూ సాగిన పవన్ ఇవాళ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.