జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల గుర్తును కేటాయించింది. జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని జనసేన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. జనసేన పార్టీని 2014 మార్చి 14న సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా జనసేనాని ప్రచారం నిర్వహించారు. అయితే తెలంగాణలో ఈ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి విధానాన్ని అవలంభించలేదు.దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు వివిధ గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. సాధారణ ఎన్నికలతోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు వర్తించనుంది.