గతనెల 25న విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత వైయస్ జగన్ పై జరిగిన దాడి కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు మహిళల ప్రమేయం ఉందని గుర్తించిన సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఏ జరిగిందనే విషయాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది సిట్. ఇక జగన్ పై దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలిలోనే ఉన్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర,విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావులకు సిట్ నోటీసులు పంపింది. నవంబర్ రెండున సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా ఘటన జరగడానికి ముందు మాట్లాడిన కాల్స్ వివరాలను సేకరించి.. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును విచారణ జరుపనుంది. ఈ డేటా ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాల్ లిస్ట్ ను విశ్లేషించుకున్న దర్యాప్తు బృందం.. జగన్ పై దాడికి ముందు శ్రీనివాస్ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన సైరాబితో మాట్లాడినట్లు గుర్తించారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు నాగుర్ వలీ మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.