ప్రియుడి కోసం భర్తను చంపింది ఓ భార్య. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. 17 ఏళ్ల క్రితం రాంబాబు, ప్రియదర్శిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అదే సమయంలో శివ సాయి అనే వ్యక్తి ప్రియదర్శిని ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా హద్దులు దాటింది. ప్రేమిస్తున్నాని శివ సాయి చెప్పడంతో.. భర్తను వదిలేసి అతనితో చెన్నై పారిపోయింది. ఆరు నెలల క్రితం భర్త, పిల్లలను వదిలి అతనితో వెళ్లిపోయింది. రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరికీ రాజీ కుదిర్చారు. అయినా తీరు మార్చుకోని ప్రియదర్శిని భర్తను హతమార్చాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. పథకం ప్రకారం ఆగస్టు 26 రాత్రి రాంబాబుకు మత్తు మందు కలిపిన భోజనం పెట్టింది. ఆపై ప్రియదర్శిని, శివసాయి కలిసి మంచంపై పడుకున్న రాంబాబు కాళ్లు, చేతులు కట్టేసి తలగడతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. పోలీసులకు తానే చంపానని చెబుతానని, తనను అరెస్టు చేసిన తర్వాత బెయిల్ తీసుకోవాలని చెప్పి శివసాయికి రూ.2 లక్షలు ఇచ్చింది. అయితే ఈనెల 10న వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు విచారణలో అసలు విషయం రాబట్టారు. దీంతో అనుమానాస్పద కేసును మార్చి హత్య కేసుగా నమోదు చేశారు.