జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కవాతులో పాల్గొనేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి చేరుకున్నారు. పవన్ చేపట్టిన ఈ యాత్రలో కార్యకర్తలతో కలిసి పాల్గొంటానంటూ ఆది ప్రకటించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా జనసేనాని కాసేపట్లో భారీ కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధవళేశ్వరం బ్రిడ్జీపై జనసేన కవాతు జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం వరకు నిర్వహించనున్న ఈ కవాతు కోసం జనసేన సైనికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ కవాతులో 2 లక్షల మంది పవన్ అభిమానులు పాల్గొంటారని తెలుస్తోంది. స్థానికులతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలివస్తారని అంచనా వేస్తున్నారు.