భూకబ్జాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే... ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల భూములను ఆక్రమిస్తున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి... పైసా ఖర్చు లేకుండా స్థలాన్ని కబ్జాచేసి.... మూడంతస్థుల భవనం కట్టేశారు. భూమిని తనకు అమ్మినట్లుగా సంతకాలు పెట్టాలంటూ యజమానిపై బెదిరింపులకు దిగారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి భూకబ్జాపర్వంపై hmtv ప్రత్యేక కథనం.
ఈ ఇల్లు... ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిది. ఆసిఫాబాద్ మెయిన్ సెంటర్‌లో ప్రధాన రహదారి పక్కన ఈ భవనం ఉంది. మొత్తం 12 సెంట్లలో ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఎమ్మెల్యే గారూ ఈ స్థలాన్ని కొనుగోలుచేసి ఇల్లు కట్టుకోలేదు. కబ్జాచేసి మూడంతస్థుల బిల్డింగ్ కట్టేశారు. తన స్థలాన్ని ఆక్రమించి ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇల్లు కట్టుకున్నారంటూ భూ-యజమాని రాజేష్... hmtvని ఆశ్రయించాడు. అలాగే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించి... రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశాడు. దాంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి... భూయజమాని రాజేష్‌పై బెదిరింపులకు దిగారు. తనకు స్థలం అమ్మినట్లుగా సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
బాధితుడు రాజేష్‌కు ఆసిఫాబాద్ రాజంపేటలో తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉంది. అయితే ల్యాండ్... ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కోట్ల రూపాయలు పలుకుతోంది. దాంతో ఈ భూమిపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కన్నుపడింది. ఇంకేముంది భూయజమానితో సంప్రదించకుండా... 12 సెంట్లను ఆక్రమించి ఇల్లు కట్టేశారు. అయితే ఆక్రమణలో ఉన్న తొమ్మిదిన్నర ఎకరాల భూమి... రాజేష్‌దేనంటూ తీర్పు రావడంతో... ఎమ్మెల్యే కోవా లక్ష్మి రంగంలోకి దిగారు. కోర్టు జడ్జిమెంట్‌ను అమలు చేయాలంటే... 12 సెంట్ల భూమిని తనకు అమ్మినట్లుగా సంతకాలు చేయాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు దిగారు. తాను చెప్పినట్లు వినకపోతే... ఒక్క సెంటు భూమి కూడా నీకు దక్కదంటూ వార్నింగ్ ఇచ్చారు. అనవసర వివాదాలకు పోతే... నీకే నష్టమని... సయోధ్య చేసుకోవాలాంటూ రాజేష్‌తో అతని కుటుంబ సభ‌్యులపై బెదిరింపులకు దిగారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి.
అయితే తప్పుడు పత్రాలతో తన భూమిని కబ్జాచేశారని, ఈ ఆక్రమణల వెనుక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాత్ర ఉందంటూ బాధితుడు రాజేష్ ఆరోపిస్తున్నాడు. అయితే బాధితుడు రాజేష్ ఆరోపణలను ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఖండించారు. భూమిని కొనుగోలుచేసి తాను ఇల్లు కట్టుకున్నట్లు ప్రజలకు తెలుసన్నారు. రాజకీయంగా దెబ్బకొట్టేందుకే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. అయితే భూమిని ఆక్రమించుకున్నట్లు ఫోన్ సంభాషణలో అంగీకరించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి... 12 సెంట్ల భూమిని తనకు అమ్మినట్లు సంతకం పెడితే.... మిగతా 9 ఎకరాలు నీ పేర పట్టా చేయిస్తానంటూ సెటిల్‌మెంట్‌కి దిగారు. దాంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై చర్యలు తీసుకొని.... తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు బాధితుడు.