ఏపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి పంటి చికత్స కోసం రెండు లక్షల 88 వేల రూపాయలు విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సింగపూర్‌లోని ఎజూర్ డెంటల్ ఆసుపత్రిలో రూట్ కెనాల్ చికిత్స కోసం ఈ మొత్తాన్ని విడుదల చేశారు. అయితే రాష్ట్రంలోని ఏ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా వేలల్లో బిల్లు అయ్యే చిన్న సమస్యకు లక్షలు వెచ్చిస్తారా అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జీవో ప్రతులను పెడుతూ యనమల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ప్రజలకు కూడా సింగపూర్‌లో వైద్యం చేయిస్తారా అంటూ పలువురు నెటీజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.