ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రానిక్ -వే బిల్లును తప్పనిసరి చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలపాటు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని భావించామన్నారు.
సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడిందని జైట్లీ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న రిటర్నుల విధానాన్నే జూన్ వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, అంతర్రాష్ట్ర రవాణా కోసం ఈ–వే బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరి 1నే అమలు చేయగా ఆ వ్యవస్థలో లోపాలు తలెత్తి సరిగ్గా పనిచేయకపోవడం తెలిసిందే. దీంతో అక్కడ నెలకొన్న తప్పులన్నింటినీ సరిదిద్ది అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లులను మళ్లీ తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.
ఒకే రాష్ట్రంలో రవాణాకు కూడా ఈ–వే బిల్లులను దశల వారీగా తప్పనిసరిచేస్తామన్నారు. దీనికోసం రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజిస్తామని ఆయన తెలిపారు. జూన్ 1 నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ–వే బిల్లుల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. ఏప్రిల్ 15న తొలిదశను అమలు చేస్తామనీ, ఆ రాష్ట్రాలేవో ఏప్రిల్ 7న ప్రకటిస్తామని ఆయన తెలిపారు.