అగ్రిగోల్డ్ వ్యవహరంపై.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు సత్వర న్యాయం చేయడం కోసం ప్రభుత్వమే కొంతమేర డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. డబ్బుల చెల్లింపుపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని, కోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితులకు చెల్లింపులు చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయించారు.
ఏపీ కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న అంశాలను కూడా సరిగా పట్టించుకోకపోతే ఎలా అంటూ న్యాయశాఖ అధికారులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ కేసులో.. కోర్టు నుంచి క్లారిటీ తెప్పించేలా ఎందుకు వాదనలు వినిపించలేకపోతున్నారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. మీ వల్ల కాకపోతే.. తానే కోర్టుకెళ్లి వాదనలు వినిపిస్తానన్నారు చంద్రబాబు. బాబ్లీ ఉద్యమం సమయంలో.. మహారాష్ట్ర కోర్టులో తామే వాదనలను వినిపించిన విషయాన్ని బాబు గుర్తుచేశారు.
చివరికి.. అగ్రిగోల్డ్ విషయంలో.. మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు సత్వర న్యాయం చేయడం కోసం.. ప్రభుత్వమే కొంతమేర డబ్బులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంతమొత్తం చెల్లించాలి, ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే దానిపై.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని డిసైడ్ అయ్యారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితులకు చెల్లింపులు చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇక అగ్రిగోల్డ్ కేసు వాదించేందుకు ఢిల్లీ నుంచి న్యాయనిపుణులను తీసుకొచ్చి.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. అగ్రిగోల్డ్ బాధితులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో.. ఇవాళ తలపెట్టిన ఆత్మఘోష యాత్రను రద్దు చేసినట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రకటించింది. అయితే, తమ దయనీయ పరిస్థితుల దృష్ట్యా.. కనీసం 2 వేల కోట్లు తాత్కాలికంగా అందించాలని బాధితుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.. ప్రభుత్వ ప్రతినిధిగా చర్చలకు హాజరైన మంత్రి ఆనందబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పటిలోగా ఆర్థిక సహకారం అందించేది నిర్దిష్టంగా చెప్పాలని బాధితుల సంఘం డిమాండ్ చేసింది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.