ఏపీని పెథాయ్ తుఫాను భయం వణికిస్తోంది. ఉత్తర కోస్తావైపు తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. 6 నుంచి 8 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసి పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దాంతో బీచ్ లకు వెళ్లడం.. సముద్రంలో చేపల వేటకు దూరంగా ఉండాలన్నారు. దాంతో రెండు, మూడు రోజులుగా చేస్తున్న హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. ముందుగా నెమ్మదించిన తుఫాన్… ఆ తరువాత వేగం పుంజుకుంటోంది. రేపు సాయంత్రానికి తూర్పుగోదావరి-విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన అధికారులు…ఆయా ప్రాంతాలకు ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు పెథాయ్ తుపాన్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. జిల్లాలో నేడు, రేపు చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని అన్నారు.