దేశంలో అతిపెద్ద రెండో బ్యాంకింగ్ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.11,436కోట్లు కుంభకోణం జరగడం సంచలనమైంది. బ్యాంకింగ్ సంస్థలు - వ్యాపారస్థుల మధ్య తరుచుగా వినిపించే బయ్యర్స్ క్రెడిట్ ను అడ్డుగా పెట్టుకొని ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఈ మోసానికి తెరతీసిన విషయం తెలిసిందే. అయితే ఈ కుంభకోణానికి కారణం ఆర్బీఐ ఆడిట్ లోపాల వల్లేనని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. పీఎన్బీలో మోసం సమయంలో ఆర్బీఐ అడిట్ సక్రమంగా లేనందువల్లే భారీ కుంభకోణం జరిగిందని అన్నారు. మోసాలను అరికట్టేందుకు మరింత పటిష్ఠమైన ఆడిటింగ్ వ్యవస్థ అమల్లోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. సాధారణంగా బ్యాంకుల నియంత్రణ చర్యలను ఆర్‌బీఐ పర్యవేక్షిస్తూ ఉంటుందని.. ఏవైనా విధానపరమైన లోపాలు జరిగినప్పుడు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
జనవరి 16న నీరవ్ మోడీ, ఆయన సోదరుడు నిశాల్ మోడీ, నీరవ్ భార్య అమీ నీరవ్ మోడీ, మరో వ్యాపార భాగస్వామి మెహుల్ చినూభాయ్ చోక్సీకి సంబంధించిన కంపెనీలు డైమండ్ ఆర్ యుఎస్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ లు తమకు బయ్యర్స్ క్రెడిట్ కావాలని ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల్ని కోరాయి. ఈ బయ్యర్స్ క్రెడిట్ ద్వారా విదేశాల నుంచి ఎగుమతి దిగుమతి చేసుకునే వ్యాపారస్థులకు బ్యాంకులు స్వల్ప కాలిక రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. అయితే నీరవ్ మోడీ తమకు విదేశాలనుంచి సరుకు వస్తుందని , అందుకు సంబంధించిన పత్రాలు సమర్పిస్తామని సూచించాడు. అవసరమైన రుణం పొందేందుకు హామీగా ఇచ్చే లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్ఓయూ- ఏ దేశం నుండి అయినా సరుకును ఎగుమతి చేసుకునే వారికి దిగుమతి వారి తరుపు నుంచి ఇచ్చే గ్యారెంటీ ) కావాలని విజ్ఞప్తి చేశాయి.
దీనికి ఆ బ్యాంక్ సంబంధిత శాఖా అధికారులు తమకు 100% క్యాష్ మార్జిన్ కావాలని కోరాయి. దీంతో నీరవ్ మోడీ సంస్థలు తాము గతంలో ఎల్ ఓయూ లు లేకుండా రుణాన్ని పొందినట్లు చెప్పారు. ఎల్ ఓయూ లు లేకుండా రుణాన్ని ఎలా పొందాయని పీఎన్బీ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ లోతుగా విశ్లేషించగా రూ. 11,436 కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణానికి బ్యాంకు అధికారులు వంతపాడడం పరిపాటి అయ్యింది.
సదరు సంస్థలకు ఎల్ ఓయూలు ఇచ్చినట్లు బ్యాంకు రికార్డుల్లో లేకపోవడం అనుమానం బలపడింది. దీనికి తోడు బ్యాంకిగ్ లో ‘స్విఫ్ట్' అనే మెసేజింగ్ సిస్టం నుంచి పీఎన్బీ బ్యాంకు ఉద్యోగులు హాంకాంగ్‌లోని అలహాబాద్ బ్యాంకుకు ఐదు మెసేజ్‌లు, యాక్సిస్ బ్యాంకుకు నీరవ్ మోడీ తదితరుల సంస్థలకు బయ్యర్స్ క్రెడిట్ పెంచినట్లుగా సమాచారం అందించారు. దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సంబంధిత బ్యాంకు ఉద్యోగుల్ని నిలదీయగా నీళ్లు నములుతు సమాధానం చెప్పారు.
దీంతో పీఎన్బీ ఉన్నతాధికారులు ముంబై బ్రాడీహౌస్‌లోని తమ మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో కొన్ని మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ లభించినట్లు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో పాలు పంచుకున్న బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ తో సహా 10మందిని విధుల నుంచి తొలగించారు.
అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ, సెబీ నీరవ్ మోడీ 11 కార్యాలయాల్లో విచారణ చేపట్టగా నీరవ్ మోడీ రెండు సార్లు మోసానికి పాల్పడ్డట్లు తేలింది. ఈ నెల 5న నీరవ్ మోడీ తమ బ్యాంకును రూ.280 కోట్లు, ఇప్పుడు రూ.11,436కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం పై ఆరోపణలు రావడంతో నీరవ్ మోడీ స్విట్జర్ లాండ్ కు చెక్కేసినట్లు విదేశాంగ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన గ్యారంటీతో నీరవ్ మోడీ ఆరు బ్యాంకుల నుంచి రుణం పొందాడని తేల్చిచెప్పింది. ఓ వైపు దాడులు జరుగుతుండగా విదేశాల్లో ఉన్న మోడీ తాను రూ. 5వేలకోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని భారత ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం.