New Train Timings: జనవరి 1 నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు
New Train Timings: భారతీయ రైల్వేస్ కొత్త టైం టేబుల్ తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు చేసింది.
New Train Timings: భారతీయ రైల్వేస్ కొత్త టైం టేబుల్ తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి టైం టేబుల్ అమల్లోకి రాబోతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు రైల్వే సర్వీసులను మెరుగుపరిచేందుకు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు చేసినట్టు తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ లో ఈ వివరాలను రైల్వేశాఖ ఉంచింది.
ఈ నేపథ్యంలో రైళ్ల సమయాలను ముందే పరిశీలించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సూచించింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత రైల్వే స్టేషన్లలో ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ (www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుందని సూచించింది. సంబంధిత స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పింది.
15 నిమిషాల ముందుగానే రత్నచల్ ఎక్స్‌ప్రెస్
కొత్త మార్పుల్లో భాగంగా.. దక్షిణ మధ్య రైల్వేలోని కొన్ని రైళ్ల టైమింగ్స్ మారబోతున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్ ప్రెస్.. ఇక నుంచి విజయవాడ స్టేషన్‌లో 15 నిమిషాల ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్ ప్రకారం అయితే విజయవాడ స్టేషన్ నుంచి రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఉదయం 6.15 గంటలకు బయలుదేరుతుంది. కొత్తగా వచ్చిన షెడ్యూల్ ప్రకారం 15 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. ఈ ప్రకారం ప్రయాణికులు ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
ఎంఎంటీఎస్ ట్రైన్స్ సమయాల్లో మార్పులు
ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ జనవరి 1వ తేదీ నుంచి మార్పులు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లను అనుసంధానం చేసేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఈ మార్పులు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.