Adani Bribery Case : ఖచ్చితమైన ఆధారాలు, దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్న ఏపీ సర్కార్.. ఆ తర్వాతే అదానీ గ్రీన్‌పై చర్యలు

Update: 2025-01-03 05:26 GMT

Adani Bribery Case: అమెరికా కోర్టు దాఖలు చేసిన లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రమేయంపై భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే, ఈ స్కామ్‌పై మరిన్ని ఆధారాల కోసం వేచి చూడాలని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఏం చెప్పారు?

గురువారం క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి కె. పార్థసారథి ప్రభుత్వం వేచి ఉండటానికి అనుకూలంగా ఉందని, అమెరికాలో కేసు నడుస్తున్నందున దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తామని స్పష్టం చేశారు.

ఆఫ్ కెమెరాలో సీఎం చంద్రబాబు ఏం చెప్పారు?

ఇదిలా ఉంటే.. పక్కా ఆధారాలు లేకుండా ఎలాంటి ఒప్పందాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని, రాష్ట్రానికి భారీ జరిమానా విధించే అవకాశం ఉందని మీడియాతో ఆఫ్ కెమెరా, ఆన్ రికార్డ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కచ్చితమైన ఆధారాలు లభించే వరకు ఎలాంటి ఒప్పందం నుంచి వెనక్కి తగ్గలేమని, మరిన్ని వాస్తవాలను బయటకు తీసుకురావాలని, ఆరోపణలు నిజమని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

నవంబర్‌లో వెలుగులోకి విషయం

నవంబర్‌లో అమెరికాలో లంచం ఆరోపణలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 22 న చంద్రబాబు ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో "నష్టపరిచే" విషయంగా అభివర్ణించారు. ప్రభుత్వం వాస్తవాలను పరిశీలిస్తోందని, తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ వివాదాన్ని తిరుపతి లడ్డూలో కల్తీకి ఉదాహరణగా చంద్రబాబు ముడిపెట్టారు. ఈ విషయంపై జగన్‌పై చర్యలు తీసుకోవాల్సి వస్తే అదొక అవకాశమని, అయితే ప్రతీకార రాజకీయాలను నమ్మను, టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి ఉన్న తేడా అదేనని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం

అమెరికా ఆరోపణలు, మాజీ సీఎం జగన్ ప్రభుత్వం, అదానీ ప్రమేయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, కేంద్రంలోని కాంగ్రెస్ కూడా మోడీ ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేలో కీలక భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఈ అంశంపై వెయిట్ అండ్ వాచ్ ఎత్తుగడ రాజకీయాలను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News