ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సోషల్‌మీడియా మాజీ ఇన్‌చార్జి నటి దివ్య స్పందన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొన్న(బుధవారం) 182 మీటర్ల పొడవైన భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహం చుట్టూ కలియ తిరిగారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహం పాదాల వద్ద ఉంటూ ప్రధాని మోదీ ఫోటో దిగారు. దాంతో అది సామజిక మాధ్యమాల్లోకి వచ్చేసింది. ఈ ఫోటొను దివ్య షేర్ చేస్తూ ఇది పిట్టరెట్టలా ఉందంటూ కామెంట్లు పెట్టింది. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆమెపై విరుచుకుపడ్డారు. దివ్య స్పందన భాష అహంకారపూరితమని ఆమెకు రీట్వీట్లు చేశారు. దీనిపై బీజేపీ అధికారప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ప్రధానిని విమర్శించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. అందులో ప్రధమంగా దివ్య స్పందన ఉందని అన్నారు. అయితే దివ్య స్పందన.. తన వ్యాఖ్యలపై ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇదిలావుంటే గతంలో కూడా దివ్యస్పందన ప్రధానిపై వివాదాస్పద కామెంట్లు చేసింది. మోదీని ఉద్దేశించి 'చోర్' అనే పదం వాడటంపై అప్పట్లో బీజేపీ కార్యకర్తలు ఆమెను తీవ్రంగా విమర్శించారు.