పొద్దున్న లేచింది మొదలు.. దినచర్య ప్రారంభమయ్యేది పళ్లుతోముకుని మొహం కడుక్కోవడంతోనే. దుర్వాసనను పోగొట్టి నోట్లోని బాక్టీరియాను తరిమేసి పళ్లను శుభ్రంగా చేసుకునేందుకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితాల్లో టూత్‌పేస్ట్ భాగమైపోయింది. అయితే, టూత్‌పేస్టులో ట్రైక్లోసన్ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. అది కాసింత కడుపులోకి వెళ్లినా.. పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్ ఆమ్‌హెర్స్ట్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ‘ఉత్పత్తి దారులు ఆ రసాయనాన్ని వాడకుండా ఉండలేరు. వాడితే మనిషికి ప్రమాదమే’ అని తెలిపారు. ఎలుకలకు ట్రైక్లోసన్ తినిపించి పరిశోధనలు చేయగా వాటి లో జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా (గట్ బ్యాక్టీరియా) చనిపోయినట్లు తేలిందన్నారు. అమెరికాలో కొన్ని ఉత్పత్తులపై నిషేధం ఉన్నా మిగతా దేశాల్లో ఈ రసాయనంపై ఎక్కడా నిషేధం లేదని వివరించారు. ఇప్పటికే ఈ రసాయనం ప్రపంచం నలువైపులా సబ్బులు, టూత్‌పే్‌స్టల రూపంలో వ్యాపించిందని, దీనివల్ల మరింత నష్టం జరగకముందే తక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.