తెలంగాణలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల మధ్య కోల్డ్‌ వార్‌‌

Update: 2018-05-10 06:45 GMT

తెలంగాణలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఐఏఎస్‌లు నిర్వహించాల్సిన కీలక పోస్టుల్లో ఐపీఎస్‌లను నియమించడంపై గుర్రుగా ఉన్నారు. ఐఏఎస్‌‌ల్లో రెండు గ్రూపులున్నా... ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా సీనియర్ ఐఏఎస్‌లను ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తున్నారని మండిపడుతున్నారు. కనీసం తెలంగాణ ఐఏఎస్‌లకు కూడా ప్రాధాన్యత దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ఐఏఎస్‌లతో భర్తీ చేయాల్సిన పోస్టులను ఐపీఎస్‌లతో భర్తీ చేస్తుండటంపై ఐఏఎస్‌లు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్ధంగా ప్రజలకు చేరువ చేయాలంటే.... అది ఐఏఎస్‌లకు మాత్రమే సాధ్యమని... అలాంటి కీలకమైన పోస్టుల్లో ఐపీఎస్‌లను నియమించడం సరికాదంటున్నారు. రెండూ సివిల్‌ సర్వీసులే అయినా.... మొత్తం వ్యవస్థనే డీల్‌ చేసే విధంగా ఐఏఎస్‌ల శిక్షణ ఉంటుందని, అదే ఐపీఎస్‌లకైతే కేవలం లా అండ్‌ ఆర్డర్‌‌పైనే ట్రైనింగ్‌ ఉంటుందని గుర్తుచేస్తున్నారు. దాంతో వ్యవస్థను డీల్‌ చేసే విధానంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు చాలా వ్యత్యాసం ఉంటుందంటున్నారు. కానీ తెలంగాణలో ఐఏఎస్‌‌లు నిర్వహించాల్సిన పోస్టులను ఐపీఎస్‌లతో భర్తీ చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదంటున్నారు.

అత్యంత కీలకమైన పౌర సరఫరాలశాఖ కమిషనర్‌‌గా ఐఏఎస్‌ను నియమించాల్సి ఉండగా... ప్రక్షాళన పేరుతో మొన్నటివరకూ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌కి అప్పగించారు. అయితే సీవీ ఆనంద్‌ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాక కూడా..... మళ్లీ ఆ పోస్టులో ఐపీఎస్‌ అకున్‌ సబర్వాల్‌ను నియమించడాన్ని తప్పుబడుతున్నారు. అలాగే సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సెక్రటరీగా గతంలో ఐఏఎస్‌‌లు ఉండగా.... ఆ పోస్టులో ప్రస్తుతం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌‌ పనిచేస్తున్నారు. అంతేకాదు సోషల్‌ వెల్ఫేర్ బోర్డుల్లో ఉద్యోగ నియామకాలు చేసుకునేలా.... ఛైర్మన్‌ పదవిని కూడా ప్రవీణ్‌‌కుమార్‌కే అప్పగించడంపై మండిపడుతున్నారు. అలాగే కీలకమైన హోంశాఖ సెక్రటరీ పదవిని ఐపీఎస్‌ అధికారి త్రివేదికి అప్పగించారు. 

ఇలా కీలకమైన పోస్టులను ఐపీఎస్‌లతో భర్తీ చేయడంపై ఐఏఎస్‌లు మండిపడుతున్నారు. తమను కాదని.... ఐపీఎస్‌లను ఆ పోస్టుల్లో ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్‌ ఐఏఎస్‌‌లను ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయడంపైనా గుర్రుగా ఉన్నారు. అలాగే తెలంగాణ ఐఏఎస్‌లకు కూడా ప్రాధాన్యత దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కీలక పోస్టుల్లో ఐపీఎస్‌లను నియమించడమనేది ప్రభుత్వ నిర్ణయమైనప్పటికీ.... ఈ పరిణామం ఐఏఎస్‌లకు మింగుడుపడటం లేదు. పైగా సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రాధాన్యతలేని పోస్టులకు బదిలీ చేస్తూ.... ఐపీఎస్‌‌లను అందలమెక్కిస్తున్నారని మండిపడుతున్నారు. 

Similar News