తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనులను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయడంతో పాటు మేడారం, రామడుగులోని టన్నెల్స్‌ను కేసీఆర్ పరిశీలించనున్నారు. తర్వాత అధికారులతో పనులు జరుగుతున్న తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తుండటంతో ప్రజలు పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్వాసితులు తమ పరిహారం పెంచాలని కోరనున్నారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో తమ గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించాలంటూ రెండు గ్రామాల ప్రజలు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. ఏళ్లుగా నానుతున్న మోతే ప్రాజెక్టుపై స్పందించాలని చొప్పదండి నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన మొత్తం హెలికాప్టర్‌లో జరుగుతున్నా సమీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేర్ వరకు నిర్మిస్తున్న పంప్ హౌస్‌లు, టన్నెళ్లు, బ్యారేజీలు దగ్గర్నుంచి పరిశీలించనున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఇటీవలే ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేశారు. అయితే సమీపంలోని అన్నారం, కొక్కెరకుంట గ్రామాల చెరువులకు నీళ్లు ఇవ్వలేదు. దీంతో తమ గ్రామాల చెరువులకు నీళ్లు విడుదల చేయాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.