ఆగస్టు 15 నుంచి రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టే అవసరం లేకుండా రైతులందరికీ 5 లక్షల చొప్పున జీవిత బీమా వర్తింపచేసేలా LICతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైతులకు జీవిత బీమా పథకం విధి విధానాలను ఖరారయ్యాయి.
రైతులకు జీవిత బీమా పథకం రూపకల్పనపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు, ఎల్‌ఐసీ ప్రతినిధులతో మాట్లాడి విధివిధానాలను ఖరారు చేశారు. రైతులందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని ఇటీవల ప్రకటించిన కేసీఆర్...ఈ మేరకు ఎల్‌ఐసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. రైతు ఏ కారణంతో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా...నామినీకి పది రోజుల్లోగా 5 లక్షల ప్రమాద బీమా చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభించి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందచేస్తారు.
రైతు జీవిత బీమా పథకం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల రైతులందరికీ ప్రతీ ఏడాది బీమా వర్తింపచేస్తారు. ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీనే దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. నామినీని ఎంచుకునే స్వేచ్ఛ రైతుదే. ముందుగానే రైతు నుంచి నామినీని ప్రతిపాదించే పత్రం తీసుకుంటారు. దాని ప్రకారమే బీమా సొమ్ము చెల్లిస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ ధృవీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. పదిరోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించకపోతే ఎల్‌ఐసీకి ప్రభుత్వం జరిమానా విధిస్తుంది. ప్రతీ ఏడాది బడ్జెట్‌లోనే ప్రీమియం కోసం నిధులు కేటాయించి ఆగస్టు 1న ఎల్‌ఐసీకి చెల్లిస్తారు.