ప్రధానికి 16 అంశాలపై కేసీఆర్‌ వినతి

Update: 2018-12-26 15:43 GMT


ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. సుమారు గంటకు పైగా సాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన 16 అంశాల చిట్టాను మోడీ ముందుంచారు. పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పరిష్కరించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సాయంత్రం ప్రధాని మోడీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గంటా 10 నిముషాల పాటు సాగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ అంశాలపై చర్చ జరిగింది. ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సుమారు గంటా 10 నిముషాల పాటు వీరి సమావేశం సాగింది. 

ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 16 అంశాలపై మోడీకి కేసీఆర్‌ ఓ వినతి పత్రాన్ని అందజేశారు. సచివాలయం నిర్మాణానికి బైసన్‌ పోలో గ్రౌండ్‌ అప్పగించాలని, హైదరాబాద్‌లో ఐఐఎంతో పాటు ఐఐఎస్‌ ఈఆర్‌ ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరారు. కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని లేకపోతే ప్రత్యేక సాయం అయినా అందించాలని ప్రధానిని కోరారు. అంతేకాకుండా కొత్త జిల్లాల్లో 21 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటుతో పాటు ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్‌లో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటు, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించాలని.. కృష్ణానది జలాల పంపిణీపై తెలంగాణ దాఖలు చేసిన పిటీషన్లను ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్‌ చేయాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్‌లోని సంస్థలను వెంటనే విభజించాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, వరంగల్‌లో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 650 కోట్ల నిధులను విభజన చట్టం ప్రకారం కేటాయించాలని ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద తెలంగాణకు నిధులు కేటాయించాలని కేసీఆర్‌ ప్రధాని మోడీని కోరారు. మోడీతో భేటీ తర్వాత ఆ వెంటనే కేసీఆర్‌ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 

Similar News