తెలంగాణ కోసం బయలుదేరిన రోజుల్లో తనను ఎంతో అవమానపరిచారని, అవహేళన చేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. 14 ఏండ్లు ప్రజల దీవెనలతో ఉద్యమించి, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే కరంటు రాదని, పరిశ్రమలు తరలిపోతాయని అన్నారన్నారు సీఎం. అంధకారంలో మునిగిపోతారని ప్రజలను గందరగోళానికి గురిచేశారని మండిపడ్డారు. ఆ మాటలను తారుమారు చేసి, కరంటు సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. 2014కు ముందు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరంటు పోతే వార్త అని సీఎం చెప్పారు. రూ.92 వేల కోట్ల నిధులు సమీకరించి కరంటు సమస్యను పరిష్కరించుకున్నామని, 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించుకున్నామని, కొద్ది రోజుల్లోనే 28వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తిని సాధించుకుంటామని వివరించారు. దేశంలో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదుగుతుందని, రాష్ట్రంలో ఇక కరంటు సమస్య ఉండబోదని సీఎం స్పష్టంచేశారు.