ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు

Update: 2018-12-26 16:30 GMT


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఆసరా పెన్షన్లపై దృష్టి సారించిన ఆయన పంచాయతి రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు అందజేయాలని ఆదేశించిన ఆయన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలంటూ సీఎస్‌కు సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.  గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు తెలంగాణలో 65 ఏళ్లు నిండిన వారికి ఆసరా పథకం కింద వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం 13లక్షల 27వేల 090 మంది పెన్షన్ పొందుతున్నారు.  

57 ఏళ్లు నిండిన వారికి కూడా పెన్షన్లు ఇస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కేసీఆర్ సీఎం బాధ్యతలు స్వీకరించాక చేసిన మొదటి సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ ఒకటి నుండి దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. 57 ఏళ్లు నిండిన వారి లెక్కలు తేల్చి వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆదేశించారు. 57 ఏళ్లు నిండిన వారిని గుర్తించేందుకు పంచాయతీరాజ్ శాఖ అసెంబ్లీ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటోంది. EC నవంబర్ 19  2018న తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఈ ఓటరు జాబితా ప్రకారం అర్హులను గుర్తించనున్నారు. ఆ తర్వాత తుది జాబితా రూపొందించనున్నారు. తుది జాబితాలోని అర్హుల సంఖ్య ఆధారంగా 2019-2020 బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు. 57 ఏళ్లు నిండిన వారి సంఖ్య సుమారు ఏడు లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 

Similar News