ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, సీఎం ఢిల్లీ టూర్ విశేషాలను నేతలతో పంచుకున్నట్టు సమాచారం. రాహుల్‌తో భేటీ విషయాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇకపై జాతీయ పార్టీల నేతలతో వరుస భేటీలుంటాయని చంద్రబాబు టీడీపీ నేతలకు తెలియజేశారు.
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. ఇక నుంచి ప్రతి జిల్లాలో రెండు రోజులు బస చేస్తానని తెలిపారు. కృష్ణా జిల్లాలో ధర్మపోరాట దీక్ష ముగింపు కార్యక్రమం నిర్వహించుకుందామని నేతలకు చంద్రబాబు చెప్పారు. గ్రామ దర్శినిని పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు.
సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థ లాంటి వాటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చంద్రబాబు తెలిపారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి తగిన శాస్తి అని.. ఈ ఫలితాలతోనైనా ప్రధాని మోడీ తన ధోరణి మార్చుకుంటారన్న భావనను సీఎం వెలియబుచ్చారు.