కేఈ బ్రదర్స్‌కి సీఎం చంద్రబాబు కాస్త అడ్వాన్స్‌గా న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకొని తన వెంటే ఉంటూ నమ్మకస్తుడిగా మెలుగుతున్న కేఈ బ్రదర్స్‌లో ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ కట్టబెట్టారు బాబు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేఈ ప్రభాకర్‌ను ఎంపిక చేసిన చంద్రబాబు- కర్నూలు కోటలో పార్టీ పునాదులను పటిష్ఠం చేయబోతున్నారా? కర్నూలు జిల్లాలో తెలుగుదేశానికి పునర్వైభవం తీసుకొచ్చే ఎత్తుగడలో ఇది భాగమా?
కేఈ బ్రదర్స్. తెలుగుదేశం పార్టీకి విధేయులు. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు. కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే బాబు క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే కేఈ ప్రభాకర్ ఇదే చంద్రబాబు నాయకత్వంలో గతంలో తొమ్మిదేళ్లు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభం తర్వాతి నుంచి అత్యంత నమ్మకస్తులుగా, పార్టీ విధేయులుగా ఉన్న కేఈ బ్రదర్స్‌లో ప్రభాకర్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ కట్టబెట్టారు చంద్రబాబు. కాస్త అడ్వాన్స్ కొత్త సంవత్సర కానుకగా ఎమ్మెల్సీని అందించారు.
కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ తరపున కేఈ ప్రభాకర్ నామినేషన్ వేశారు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు నామినేషన్ పత్రాలను జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు కేఈ ప్రభాకర్. కర్నూలు జిల్లాలో అనుకోని విధంగా ఉపఎన్నిక అనివార్యమైందని, చంద్రబాబే స్వయంగా కసరత్తు చేసి కేఈ ప్రభాకర్‌ను ఎంపిక చేశారని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. తిరుగులేని ఆధిక్యం ఉన్న తమ పార్టీకి గెలుపు సులభమన్నారు.
ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని, ఆ విశ్వాసాన్ని ఎమ్మెల్సీగా గెలిచి నిరూపించుకుంటానని చెప్పారు కేఈ ప్రభాకర్. చంద్రబాబు నాయకత్వంలో గతంలో 9 ఏళ్లు మంత్రిగా పనిచేశానని విషయాన్ని కోట్ చేస్తూ అభివృద్ధి కోసం తెలుగుదేశానికి పట్టం కట్టాలని కోరారు. మొత్తానికి తన రాజకీయ వ్యూహంలో భాగంగా కేఈ ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కాగా కట్టడి చేశారని చెబుతున్నారు జిల్లా తమ్ముళ్లు. పార్టీపై విధేయత పాటించే ఎవరికైనా కాస్త ఆలస్యంగా అయినా పట్టం కట్టబెడతారనడానికి కేఈ ప్రభాకరే ఉదాహరణ అంటున్నారు తమ్ముళ్లు.