హైటెక్ సిటీలో పట్టపగలే హైటెక్ మోసం. నగరవాసి జేబు నిలువు దోపిడీ. సౌకర్యవంతమైన ప్రయాణం అని ఎక్కితే దిగేటప్పుడు బిల్లు చూసి బేర్ మనాల్సిందే. హైదరాబాద్‌లో క్యాబ్ సంస్థలు ఎడాపెడా దోచేస్తున్నాయి. పీక్ అవర్స్ అంటూ ప్రయాణికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. హైదరాబాద్ ప్రయాణ రంగంలో కొత్త ఒరవడి తెచ్చిన క్యాబ్ జర్నీ ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారింది. మొదట వ్యాపారాభివృద్ధి కోసం ఆఫర్ల మీద ఆఫర్లు.. రిక్షా కన్నా కారు చౌకగా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఇచ్చిన ఓలా, ఊబర్ సంస్థలు ఇప్పుడు హైదరాబాదీలను దోచుకు తింటున్నాయి. క్యాబ్‌లలో ప్రయాణానికి అలవాటుపడ్డ నగరవాసులకు చార్జీల మోతతో చుక్కలు చూపిస్తున్నాయి.
పీక్ అవర్స్.. స్లాక్ టైం.. పేరుతో రేడియో యాగ్రిగేటర్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. అత్యవసరంగా పనిపై బయటికెళ్లాలంటే మండే ఎండలకు భయపడి చల్లగా ఏసీ కారులో తిరిగి వద్దామని క్యాబ్ ఎక్కితే చార్జీల మోత మోగిస్తున్నాయి. అదేంటని అడిగే అవకాశం లేదు. నియంత్రించే మార్గం లేదు. దీంతో యాప్ బుకింగ్ సంస్థలు తమ ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ఆఫీసులకి వెళ్లేందుకు, వేగంగా తిరిగేందుకు సౌకర్యవంతంగా ఉంటాయని క్యాబ్‌లలో ప్రయాణిస్తున్నామని.. పీక్ అవర్స్ మాత్రమే కాకుండా మామూలు సమయాల్లో కూడా 20-30 శాతం అదనంగా వసూలు చేస్తున్నారని నగరవాసులు అంటున్నారు. చార్జీల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఓలా. ఊబర్ క్యాబ్ డ్రైవర్లు 12 గంటలకు పైగా కష్టపడినా వారికి గిట్టేది అంతంత మాత్రమే. ఏసీ గదుల్లో కూర్చొని యాప్ బుకింగ్ సంస్థలు ప్రయాణికులు, ఇటు డ్రైవర్ల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలు, మెయింటెనెన్స్‌తో గిట్టుబాటు కావడం లేదని.. తమపైనే జీఎస్టీ భారాన్ని కూడా రుద్దుతున్నాయని డ్రైవర్లు అంటున్నారు. అదనపు చార్జీలు సంస్థలే తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని క్యాబ్‌లకు ఫిక్స్‌డ్ చార్జీలు నిర్ణయించి పారదర్శకంగా అమలు చేయాలని.. బడా క్యాబ్ సంస్థలను నియంత్రించకపోతే ఈ దోపిడీ మరింత ముదిరే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.