ఒడిశాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కటక్‌లోని మహానది వంతెన పైనుంచి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పోలీసు, అగ్నిమాపకదళం, విపత్తుదళం (ఒడ్రాఫ్) జవాన్లు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకున్న డీజీపీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడారు.. అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ నగరానికి వస్తున్న జగన్నాథ్ అనే ప్రైవేట్ బస్సు కటక్‌లోని మహానది వంతెనపై వస్తున్న దున్నపోతును తప్పించే క్రమంలో దాన్ని ఢీకొని..అనంతరం 40 అడుగుల పైనుంచి నది పక్కకు పడిపోయిందని చెప్పారు. ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, దున్నపోతు మృతి చెందినట్టు వెల్లడించారు.. అలాగే పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. కాగా క్షతగాత్రులను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితుల వివరాల కోసం 6712304001లో సంప్రదించాలని డీజీపీ తెలిపారు.