పెళ్లైన పది రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన సరస్వతి గురించి మర్చిపోకముందే అటువంటిదే మరో ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వివాహమైన 20 రోజులకే భర్త మెడను దారుణంగా కోసిన నవ వధువు అతడిని చంపేందుకు ప్రయత్నించింది. బైక్‌పై వెళ్తున్న సమయంలో వెనక కూర్చున్న భార్య.. కత్తితో అతడి గొంతు కోసి చంపేందుకు యత్నించిన ఘటన సంతబొమ్మాళి మండలం కోటబొమ్మాళిలో జరిగింది.
మాలనర్సాపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కు అదే మండలంలోని గొదలాం గ్రామానికి చెందిన నీలిమ తో ఈనెల 9న వివాహమైంది. పుట్టింటికి వచ్చిన కొత్త జంట నిన్న సాయంత్రం అబ్బాయి ఇంటికి తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా చాకుతో భర్త గొంతు కోసింది. తీవ్ర గాయాలపాలైన నవీన్ కింద పడిపోవడంతో నీలిమ అక్కడి నుంచి పరారైంది. నవీన్‌ను వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్ కు తరలించారు స్థానికులు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితురాలు నిలీమ కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారించారు. కుటుంబసభ్యులు ఇష్టంలేని పెళ్లిచేశారనే అక్కసుతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పకుందని పోలీసులు తెలిపారు.