కొన్ని విషాదాలు.. కొన్ని మార్పులకు కారణం అవుతాయంటారు. అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఈ విషయాన్ని అక్షర సత్యం అని నిరూపించింది. శ్రీదేవి భర్త బోనీకపూర్ విషయంలో ఇది నిరూపితమైంది. శ్రీదేవిని బోనీ కపూర్ రెండో వివాహం చేసుకున్నాడనీ.. మొదటి భార్యతో అర్జున్ కపూర్, అన్షులాను సంతానంగా పొందాడనీ అందరికీ తెలిసిందే. కానీ.. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి.. అర్జున్, అన్షులా.. బోనీకి దూరమయ్యారు. ఒంటరిగానే గడుపుతున్నారు. చివరికి శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ లో చాలా మార్పు కనిపించింది.
ఆమె చనిపోయిందని తెలియగానే.. అర్జున్ దుబాయ్ వెళ్లాడు. తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచాడు. అన్నీ తానై నడిపించాడు. శ్రీదేవిపై కోపం కూడా లేదని చెప్పాడు. అందరిలానే తానూ శ్రీదేవిని ఓ హీరోయిన్ గా అభిమానిస్తానని అన్నాడు. దాంతో.. బోనీ కపూర్ కు అర్జున్ కు దగ్గరైన సంబంధం.. తాజాగా మరింత బలపడింది. నమస్తే ఇంగ్లండ్ షూటింగ్ లో ఉన్న అర్జున్.. ఈ మధ్యే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని ముంబై చేరుకున్నాడు.
ఆ వెంటనే.. బోనీ కపూర్.. తన కూతర్లు జాన్వీ, ఖుషీతో కలిసి అర్జున్ ను కలిశాడు. అర్జున్ కూడా.. వాళ్లను సాదరంగా స్వాగతించాడట. తన చెల్లెలు అన్షులాను చూసుకున్నట్టే.. జాన్వీ, ఖుషీని కూడా చూసుకోవాలని అర్జున్ భావిస్తున్నాడట. దీంతో.. ఇలా అయినా.. తన కొడుకు దగ్గరికి బోనీ కపూర్ చేరుకున్నట్టుగా కొందరు అభిప్రాయపడుతున్నారు.