ప్రాణాలు నిలిపేది రక్తం. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించేది రక్తం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు. అలాంటి రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఎందరి ప్రాణాలో నిలుపుతున్నాడు కడప బృహత్తరమైన బాధ్యతను తన భుస్కంధాలపై ఎత్తుకుని నేడు ఓ మహోన్నత లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు.
కడపకు చెందిన ఈ యువకుడు పట్టుపోగుల పవన్ కుమార్. పదేళ్ల కిందట తొలిసారిగా తన తల్లి కోసం రక్తదానం చేశాడు. 2007లో తన తల్లికి వెన్నముక ఆపరేషన్ కోసం తిరుపతి స్విమ్స్‌లో అడ్మిట్ చేశాడు. వైద్యులు తల్లికి పెద్ద శస్త్రచికిత్స చేయాలి రక్తం సమకూర్చుకోవాలని చెప్పారు. అప్పుడు రక్తదానం కోసం చాలా మందిని సంప్రదించాడు. కానీ ఎవరూ స్పందించలేదు. అప్పుడే అతనికి వయసు తక్కువ ఉన్నప్పటికీ మొదటిసారి రక్తదానం చేశాడు. మరోమారు 2010లో తన భార్య గుండె శస్త్రచికిత్స కోసం ఎదురైన అనుభవంతో బ్లడ్ 2 లివ్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు.
అదే స్పూర్తితో 2007 నుంచి ఒక ఉద్యమంగా, ఒక సేవగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. 2012 ఆగస్టు 22న బ్లడ్2లివ్ సంస్థను నెలకొల్పి ఎక్కడేగానీ రక్తం కొరత లేకుండా చూడాలని నా వంతుగా ప్రయత్నిస్తున్నాడు. రక్తదానంపై లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారు. రక్తదానం గురించి సమగ్ర సమాచారాన్ని పొందుపరిచి ఇదో రక్త సంబంధం అనే పుస్తకాన్ని బ్లడ్2లివ్ ఆధ్వర్యంలో రూపొందించి అందరికి పంచుతున్నాడు.
వనరులన్నింటిని ఉపయోగించుకుంటూ వేలాది మందిని రక్తదాతలుగా మారుస్తున్నాడు పవన్. తన సంస్థ ద్వారా తాను 14 సార్లు రక్తదానం చేశాడు. ఇప్పటి వరకు 462 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది యూనిట్ల రక్తాన్ని సమీకరించాడు. సేకరించిన రక్తాన్ని కడప రిమ్స్ ఆస్పత్రి, రెడ్‌క్రాస్ సొసైటీలలో నిల్వ చేస్తున్నారు. ప్రతి ఆరోగ్యవంతుడ్ని రక్తదాతగా చేయడం, లక్ష మందిని సభ్యులుగా చేర్చడమే తన లక్ష్యమంటున్న పవన్ తన ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాడు.