ఒక్కగానొక్క కొడుకు, చేతికి అందివచ్చాడు. ఉన్నత చదువులు చదువుతున్నాడు. పెద్ద వయసులో తమకు అండదండగా ఉంటాడని తల్లిదండ్రులు అలాంటి కుమారుడు ఇక లేడని తెలిస్తే..ఆ తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందారు. 21 యేళ్ళ వైష్ణవ్‌కు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తనువుచాలించాడు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ అర్థరాత్రి 12:30 గంటలకు మృతి చెందాడు. వైష్ణవ్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఇంత చిన్న వయసులో తమను వదిలి వెళతాడని కలలో కూడా ఊహించలేదని దత్తాత్రేయ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.