రేపటి నుంచి ఈనెల 19 వరకు టెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రోజూ రెండు సెషన్లలో టెట్ నిర్వహణ ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లోనే టెట్ నిర్వహిస్తామని, ఇందుకోసం 113 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టెట్‌రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలలో ఉపాధ్యాయ నియామకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా 10,351 ఉపాధ్యాయ పోస్టులకు జులై 6న ఏపీపీఎస్సీ నోటిఫీకేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25,26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబర్ 15న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అధిక నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. చెట్టు కింద తరగతుల నిర్వహణకు ఇకపై స్వస్తి పలుకుతామని అన్నారు.