ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటిన ఆలయాల్లో కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ దేవాదాయ శాఖ సర్యులర్ జారీ చేసింది. జనవరి 1 న దేవాలయాల్లో పండుగ వాతావరణం సృష్టించొద్దని దేవాదాయశాఖ తేల్చిచెప్పింది. భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపొద్దని ఆలయ ద్వారాలను స్వాగత తోరణాలు కట్టడం వంటివే చేయవద్దని స్పష్టం చేసింది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజు మాత్రమే దేవాలయాల్లో వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అనుబంధ సంస్ధ ధర్మపరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి ఆదేశించారు.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ భారతీయ సంసృతికి విరుద్ధం అంటూ ఏపీ దేవాదాయశాఖ తాజా సర్యులర్ లో తెలిపింది. జనవరి ఒకటిని పండుగగా చేసుకోవడం ప్రాశ్చ్యాత్య సంస్కృతి అనీ. జనవరి ఒకటిన శుభాకాంక్షలు తెలపుకోవడం భారతీయ వైదిక విధానం కాదనీ సర్యులర్లో చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా బ్రిటిష్ కాలం నాటి క్రీస్తు శకాన్నే అనుసరించడం తగదన్నారు. కాబట్టి జనవరి 1 రోజున భక్తుల డబ్బుతో దేవాలయల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం సరికాదని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు కార్యదర్శి విజయ రాఘవాచార్యులు ఈ నెల 21 ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే జనవరి 1 న దేవాలయాల్లో పూజలు నిర్వహించేందుకు భక్తులు క్యూకడుతుంటారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని దేవుళ్లని వేడుకొంటారు. ఆలయ నిర్వాహకులు దేవాలయాలల్లో అలంకరణలు చేసి , ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇకపై ఇవన్నీ నిషేధమని ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వుల్లో వివరించింది. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని సర్యులర్‌లో అభిప్రాయపడ్డారు.
ఉగాది పండగే తెలుగు వారి నూతన సంవత్సరం అని, ఆ సంప్రదాయాన్నే ఆచరించాలని దేవాదాయశాఖ తాజా సర్యులర్ లో కోరింది. ఏపీలోని అన్ని ఆలయాలకు ఈ ఆదేశాలు పంపించారు. అయితే ఏపీలో కూడా బీజేపీ మార్క్ పాలన మొదలైందని ప్రభుత్వ తాజా నిర్ణయం తీర్వాత కామెంట్లు వస్తున్నాయ్. దేవాదాయశాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావు ఉండడం వల్లే ఇలాంటి సర్యులర్ విడుదల చేశారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.