ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర ముగింపు దశకు చేసుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో యాత్ర సాగుతోంది. సోమవారం ఉదయం లింగాల వలస నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చల్లవానిపేట, సౌదాం, రేగులపాడు క్రాస్, కొప్పాలపేట క్రాస్, దుప్పాలపాడు క్రాస్, గంగుపేట, కస్తురిపాడు జంక్షన్ మీదుగా కొబ్బరిచెట్ల పేట వరకు పాదయాత్ర సాగింది. కొందరు మహిళలు జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకొచ్చారు. చిరుజల్లులు, చల్లటి గాలుల మధ్య నిర్విరామంగా 8 కిలోమీటర్ల మేరకు యాత్రను నిన్న కొనసాగించారు జగన్. మరో మూడు నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగనుంది. జనవరి 8వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ముగియనుంది. వాస్తవానికి జగన్ పాదయాత్ర నవంబర్ 10 లోపే పూర్తికావలసింది.. కానీ కోర్టు హాజరు, మధ్యలో ఆయనపై దాడి కారణాలతో రెండు నెలలు ఆలస్యంగా ముగుస్తోంది. ఇందుకోసం ఇచ్చాపురంలో భారీ పైలాన్ సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా ముగింపు సభకు రెండు లక్షన్నర మంది ప్రజలు వస్తారని వైసీపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. కాగా ఆ పార్టీ సీనియర్ నేతలు బొత్స, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాద్ రావు లు ముగింపు ఏర్పాట్లను ఇప్పటినుంచే పర్యవేక్షిస్తున్నారు.