నిరంకారీ భవన్‌పై దాడికి ఉపయోగించిన గ్రనేడ్ పాకిస్థాన్‌లో తయారైంది : పంజాబ్‌ సీఎం

Update: 2018-11-22 03:28 GMT

అమృత్‌సర్‌లోని నిరంకారీ భవన్‌పై దాడికి ఉపయోగించిన గ్రనేడ్ పాకిస్థాన్‌లో తయారైందని అన్నారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నట్టు వెల్లడించారు. అతని ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అతడు 26 ఏళ్ల బిక్రమ్‌జిత్ సింగ్‌గా తేల్చారు. దాడికి పాల్పడిన అవతార్ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా త్వరలోనే పట్టుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారని సీఎం అన్నారు. గతంలోనూ పలు సంస్థలు ఇలాంటి టార్గెట్లు పెట్టుకున్నట్లు తెలిపారు. దాడి జరుగుతుందని తమకు ముందస్తుగానే పక్కా సమాచారం అందడంతో తీవ్ర ఘటనలు జరగక్కుండా నిరోధించగలిగామన్నారు అమరీందర్ సింగ్. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులపై దాడికి పాల్పడడం సులువుగా భావించి దుండగులు వీరిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనలో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెన్సీ హస్తం ఉందని సీఎం ఆరోపిస్తున్నారు. ఐఎస్‌ఐ పంజాబ్‌లో సమస్యలు సృష్టించాలని చూస్తోందని సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు.

Similar News