బూమ్ బూమ్ పాట నాకు చాలా స్పెషల్ అంటున్నారు గాయని నిఖితగాంధీ. ఇటీవల హిట్ సాంగ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఈమె తాజాగా పాడిన పాట బూమ్‌బూమ్. స్పైడర్ చిత్రం కోసం పాడిన ఈ పాట పెద్ద హిట్ అయ్యిందన్న సంతోషంలో ఉన్న నిఖితగాంధీ తాను గాయనిగా మారడమే వింత అని పేర్కొన్నారు. ఆ కథేంటో ఆమె మాటల్లోనే చూద్దాం. నేను చెన్నైలో రామచంద్ర కళాశాలలో బీడీఎస్ చదువుకుంటున్నాను.
నేను డాక్టర్ అవ్వాలని ప్రిపేర్ అవుతున్న తరుణంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం యాదృచ్ఛికంగా వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో గాయనిగా స్థిరపడిపోయాను.తాజాగా స్పైడర్ చిత్రంలో పాడిన బూమ్‌బూమ్ పాట చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. నిజం చెప్పాలంటే హారీష్ జయరాజ్ సంగీతదర్శకత్వంలో నేను పాడిన తొలిపాట ఇదే. ఆయన సంగీత దర్శకత్వంలో పాడడం చాలా జాయ్‌ఫుల్‌గా ఉంది.
అయితే వర్క్ విషయంలో హారీష్‌జయరాజ్ చాలా పర్ఫెక్ట్‌నిస్ట్.తనకు కావలసింది వచ్చే వరకూ విశ్రమించరు. ఇక దర్శకుడు ఏఆర్.మురుగదాస్ చూడడానికి కామ్‌గా ఉన్నట్లు అనిపించినా యూనిట్ వాళ్లతో చాలా సరదాగా ఉంటారు.అదే విధంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రంలో పాడడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకూ చాలా పాటలు పాడినా స్పైడర్ చిత్రంలోని బూమ్‌బూమ్ పాట నాకు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నారు.
మహేశ్‌బాబు, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం స్పైడర్. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో ఎస్‌ఏ.సూర్య, భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని బూమ్ బూమ్ పాట ఇప్పటికే సింగిల్ ట్రాక్‌గా విడుదలై విశేష ఆదరణను పొందుతుండగా,చిత్ర టీజర్ మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా ఈ నెల 9వ తేదీన విడుదలై మూడు రోజుల్లోనే 8 మిలియన్ల ప్రేక్షకులను అలరించడం రికార్డు అంటున్నారు చిత్ర వర్గాలు. స్పైడర్ చిత్రం విజయదశమి సందర్భంగా సెప్టెంబర్ 23న తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది.