Rs.2000 Notes: గడువు ముగిసిన తర్వాత రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటి.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే..?
Rs.2000 Notes: మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా.. అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోండి.
Rs.2000 Notes: మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా.. అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోండి. ఎందుకంటే అక్టోబర్ 7 తర్వాత చాలా కష్టమవుతుంది. ఒకవేళ అప్పటికీ రూ.2000 నోట్లను మార్చుకోలేని పరిస్థితి ఉంటే ఏం చేయాలి.. ఆర్బీఐ గడువు పెంచుతుందా.. ఈ విషయాలన్నింటికి సెంట్రల్ బ్యాంకు స్పష్టమైన సమాధానమిచ్చింది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోట్ల పరిస్థితి
అక్టోబరు 8 నుంచి బ్యాంకు శాఖల్లో రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి వ్యవస్థ పూర్తిగా నిలిచిపోతుంది. అయితే దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మార్పిడికి సంబంధించిన నియమాలు గతంలో ఉన్నట్లే ఉంటాయి. ఒకసారి 20 వేల వరకు అంటే 10 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. ఎవరైన వ్యక్తి లేదా సంస్థ బ్యాంకు ఖాతాలో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయాలంటే ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే సాధ్యమవుతుంది.
దేశంలో నివసించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా అక్టోబర్ 8 నుంచి బ్యాంక్ ఖాతాలో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి పోస్టాఫీసు సహాయం తీసుకోవచ్చు. అది దేశంలోని 109 ఆర్బీఐ కార్యాలయాలకు పంపుతుంది. అయితే ఇవి ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉంటాయి. వ్యక్తులు, సంస్థలు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. కొన్ని ఛార్జీలు కూడా విధిస్తారు. న్యాయస్థానాలు, చట్టపరమైన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, దర్యాప్తు ప్రక్రియలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగమైన రూ. 2000 నోట్లను ఎలాంటి పరిమితి లేకుండా ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.
మే 19న ఆర్బీఐ నోటిఫికేషన్
రూ.2000 నోట్ల చెలమణికి సంబంధించి ఆర్‌బీఐ మే 19, 2023న నోటిఫికేషన్ జారీ చేసింది. మే 23 నుంచి రూ.2000 నోట్లను విత్ డ్రా చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. బ్యాంకులు లేదా RBI కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవాలని ప్రజలను కోరింది. గడువును సెప్టెంబర్ 30గా ఉంచింది. తర్వాత అక్టోబర్ 7 వరకు పెంచింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. అందులో రూ.3.42 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. కేవలం రూ. 14 వేల కోట్లు మాత్రమే సామాన్య ప్రజలు లేదా సంస్థల వద్ద ఉన్నాయి.