8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్..జీతాల్లో భారీ పెంపు

Update: 2024-11-24 02:10 GMT

8th Pay Commission: ప్రస్తుతం 7వ వేతన సంఘం అమలులో ఉంది. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ కమిషన్ అమలు తర్వాత ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపుదల ఉండనుంది. జీతంతో పాటు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కనీస వేతనాల్లో 186శాతం జంప్ ను చూసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కేంద్ర ఉద్యోగులందరూ ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద డీఏ పెంపు, జీతాల పెంపును పొందుతున్నారు. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ, మీడియా నివేదికల ప్రకారం, ఎనిమిదవ వేతన సంఘం వచ్చే ఏడాది సాధారణ బడ్జెట్ 2025లో అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇదేకాదు మీడియా నివేదికల ప్రకారం 8పే కమిషన్ అమలు తర్వాత కనీస జీతం 186 శాతం పెరగవచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉద్యోగుల మూల వేతనం రూ.18,000. 7వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల జీతం రూ.6వేలు పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 8పే కమిషన్ పే అమలు తర్వాత, ఫిట్‌మెంట్ అంశం 2.86 ఉండే ఛాన్స్ ఉంది. 29 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండటంతోపాటు ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86ని అమలు చేస్తే, ఉద్యోగుల జీతం 186 శాతం పెరిగి దాదాపు రూ.51,480కి చేరుతుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా మేలు చేస్తుంది. నిజానికి అది పెరిగితే పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఎనిమిదో వేతన సంఘం అమలు తర్వాత పెన్షన్ 186 శాతం పెరిగి రూ.25,740కి చేరుతుందని పెన్షనర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం పింఛను మొత్తం రూ.9వేలుకాగా... ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉన్నప్పుడు పెన్షన్ రూ.25,740 అవుతుంది.

ఎనిమిదో వేతన సంఘం అమలుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, మీడియా నివేదికల ప్రకారం, దీనిని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో (బడ్జెట్ 2025-26) ప్రకటించవచ్చు. వాస్తవానికి గత బడ్జెట్‌లో ఎనిమిదో వేతన సంఘం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జాతీయ కౌన్సిల్ సమావేశం ఉంది. ఎనిమిదో వేతన సంఘం అమలుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం నవంబర్‌లో జరగాల్సి ఉన్నా.. ఆ తర్వాత డిసెంబర్‌కు వాయిదా పడింది.

Tags:    

Similar News