Adani Group reacts: గౌతం అదానిపై కేసులో ఏపీకి లింకులు.. స్పందించిన అదాని గ్రూప్
Adani Group reacts to bribery charges against Gautam Adani: అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో గౌతం అదానిపై కేసు నమోదైంది. సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒక భారీ కాంట్రాక్టును సొంతం చేసుకునేందుకు అదాని సంస్థ భారత్‌లో కొంతమంది అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపినట్లుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 2 వేల 29 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపినట్లు అదానిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదంలో అదానితో పాటు ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ కూడా కలిపి మొత్తం ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.
అదానితో కలిసి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారిలో అమెరికా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారన్న సమాచారంతోనే అమెరికా ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టింది. అయితే, ఇందులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కూడా ఒకరు ఉన్నారని వార్తలు రావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి పేరు బహిర్గతం కానప్పటికీ నిందితుల జాబితాలో వారిని ఫారెన్ నేషనల్ అని సూచించడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలోనూ హాట్ టాపిక్ అయింది.
ఈ సోలార్ ప్రాజెక్టులో పెట్టుబడి కోసం బ్యాంకులను, పెట్టుబడిదారులను గౌతం అదాని తప్పుదోవ పట్టించారనే అభియోగాలు కూడా ఈ కేసులో ఒక భాగంగా ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్‌ను సైతం తప్పు దోవ పట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
హిడెన్ బర్గ్ ఉదంతం నాటి నుండే గౌతం అదానిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై నిజానిజాల నిగ్గుతేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని మోదీ సర్కారును కాంగ్రెస్ నిలదీస్తూ వస్తోంది. ఇంతలోనే గౌతం అదానిపై అమెరికా కోర్టులో కేసు నమోదవడం ఆ పార్టీకి మరో అస్త్రం దొరికినట్లయింది. ప్రధాని మోదీ, అదాని కుమ్మక్కయి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపి నేతలు ఖండించారు. గౌతం అదాని వివాదంలో ఆయన లంచం ఇవ్వజూపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు రాష్ట్రాలు కూడా బీజేపియేతర రాష్ట్రాలేనని అమిత్ మాల్వియ అన్నారు. అమెరికా కోర్టు చెబుతున్న 2019-24 సమయంలో ఒడిషాలో బిజు జనతా దళ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తమిళనాడులో డిఎంకే, ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నాయని మాల్వియ అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కంలకు లంచాలు ఇవ్వజూపితే అందులో బీజేపికి ఎలా సంబంధం ఉంటుందని బీజేపి నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
స్పందించిన గౌతం అదాని
అమెరికా న్యాయ శాఖ, అమెరికా సెక్యురిటిస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలను గౌతం అదాని సంస్థ తరుపున మీడియా ప్రతినిధి ఖండించారు. వ్యాపారంలో అన్ని నియమాలు పాటిస్తున్న తమ సంస్థపై చేస్తోన్న ఈ నిరాధారమైన ఆరోపణల్లో నిజం లేదని సంస్థ స్పష్టంచేసింది. తమ సంస్థ పారదర్శకంగా వ్యాపారం చేస్తోందని అన్నారు. ఈ ఆరోపణలతో అదాని షేర్లు నేడు నష్టాల్లోకి వెళ్లాయి. షేర్ హోల్డర్స్ బెంబేలెత్తిపోయారు. దీంతో షేర్ హోల్డర్స్, భాగస్వాములు, ఉద్యోగులు కూడా భయాందోళనకు గురి కావద్దని అదాని గ్రూప్ విజ్ఞప్తి చేసింది.