Lemon Prices: దేశంలో నిమ్మకాయల ధరలు పెరగడానికి కారణాలు ఇవే..!
Lemon Prices: దేశంలో నిమ్మకాయల ధరలు పెరగడానికి కారణాలు ఇవే..!
Lemon Prices: ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటన్నింటి మధ్యలో నిమ్మకాయ ధర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిమ్మకాయ కిలో రూ.350 నుంచి 400కి చేరింది. పెరిగిన నిమ్మకాయల ధరలతో వినియోగదారులే కాకుండా దుకాణదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా నిమ్మకు కొరత ఏర్పడింది. నిమ్మకాయను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే దేశంలోని ప్రాంతాలు తీవ్రమైన వేడిని ఎదుర్కోవడమే అతిపెద్ద కారణం. వేడిగాలుల కారణంగా నిమ్మ ఉత్పత్తి దెబ్బతింటోంది. నిమ్మకాయ పిందెల సమయంలోనే నాశనమవుతున్నాయి. దీని కారణంగా ఉత్పత్తి దెబ్బతింటోంది. బలమైన గాలులు, వేడి కారణంగా నిమ్మ పువ్వులు రాలిపోతున్నాయి.
గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో నిమ్మకాయను పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఈ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. వేడి కారణంగా ఉత్పత్తి దెబ్బతింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు పెరిగాయి. ఒకవైపు నిమ్మకాయల కొరత, మరోవైపు పెరిగిన రవాణా చార్జీలు రెండూ ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తున్న నిమ్మకాయల ద్రవ్యోల్బణానికి ఈసారి డీజిల్ ధరలు కారణమవుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల కారణంగా సరుకు రవాణా 15% పెరిగింది. దీంతో నిమ్మకాయ ధర రెట్టింపు అయింది.
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ పరిస్థితిలో ఫంక్షన్ కోసం నిమ్మకాయకు మరింత డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తక్కువగా ఉండడంతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నిమ్మకాయల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వేసవిలో చెరకు రసం నుంచి నిమ్మరసం వరకు ప్రతిచోటా నిమ్మకాయ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదేవిధంగా ఇది రంజాన్ మాసం. ఉపవాసం సమయంలో నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తి తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిమ్మకాయ ధరలు పెరగుతున్నాయి.