కేంద్ర ఉద్యోగులకి శుభవార్త.. కొత్త ఫార్ములాతో ఉద్యోగుల జీతాలలో పెరుగుదల..!
Central Employees: కేంద్ర ఉద్యోగులకు మరో శుభవార్త అందనుంది. 8వ వేతన కమిషన్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది.
Central Employees: కేంద్ర ఉద్యోగులకు మరో శుభవార్త అందనుంది. 8వ వేతన కమిషన్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. రాబోయే కాలంలో కొత్త ఫార్ములాతో ఉద్యోగుల జీతం పెరుగుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వాస్తవానికి 2016 సంవత్సరం ప్రారంభంలో 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేశారు. అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో కొత్త సమాచారం ఇచ్చారు. దీని ప్రకారం.. ఇప్పుడు కేంద్ర ఉద్యోగుల వేతనాలను నిర్ణయించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. అయితే కొత్త ఫార్ములాతో కేంద్ర ఉద్యోగుల జీతం ప్రతి సంవత్సరం పెరుగుతుందని తెలిపారు.
కేంద్ర ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్‌లను సవరించడానికి ప్రభుత్వం 8వ వేతన సంఘం వేయకుండా భిన్నంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి 8వ వేతన సంఘంపై ఇంకా ఎలాంటి పరిశీలన జరగలేదు. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, అలవెన్సులు, పెన్షన్‌లను సమీక్షించేందుకు పే కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పంకజ్ చౌదరి లోక్ సభలో తెలిపారు. ఇప్పుడు ఉద్యోగుల జీతం Aykroyd ఫార్ములా ద్వారా నిర్ణయిస్తామని తెలిపారు. ఈ ఫార్ములా అనేది ఉద్యోగుల ప్రస్తుతం జీతం, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, ఉద్యోగి పనితీరుతో ముడిపడి ఉంటుందన్నారు.
అంటే ఉద్యోగుల పదోన్నతులు కూడా దీని అనుగుణంగానే జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫార్ములా అనేది పరిగణనలోకి తీసుకోలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెబుతున్నారు. మరోవైపు 8వ వేతన సంఘం కూడా ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేదు. 7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.7,000 నుంచి రూ.18,000కు పెంచింది. ధరల సూచిక ప్రకారం ప్రతి సంవత్సరం కేంద్ర ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం సమీక్షించాలని జస్టిస్ మాథుర్ సిఫార్సులో పేర్కొన్నారు.