Income Tax Savings: ఈ పెట్టుబడులపై పన్నుమినహాయింపు లభిస్తుంది.. మార్చి 31 వరకు అవకాశం..!
Income Tax Savings: ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో చాలామంది పన్ను ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు.
Income Tax Savings: ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో చాలామంది పన్ను ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. సెక్షన్ 80C కింద పెట్టుబడి పెట్టడం వల్ల రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీని తర్వాత కూడా ఇతర సెక్షన్ల క్రింద పన్ను ఆదా చేసుకోవచ్చు. అలాంటి సెక్షన్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
NPS పన్ను ఆదా
సెక్షన్ 80C కింద మీ పరిమితి ముగిసినట్లయితే పన్ను ఆదా చేయడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 50,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ పెట్టుబడి సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల పరిమితికి అదనం. అంటే రూ.2 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
ఆరోగ్య బీమాపై మినహాయింపు
మీరు మీ కుటుంబానికి ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తే దానిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80డి కింద మీరు మీ జీవిత భాగస్వామి, పిల్లల ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ. 25,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా మీ తల్లిదండ్రుల వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వారి ఆరోగ్య బీమా కోసం రూ. 25,000 వరకు ప్రీమియం చెల్లించవచ్చు. కానీ మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే ఈ పరిమితి రూ. 50,000 వరకు ఉంటుంది.
హెల్త్ చెకప్‌పై మినహాయింపు
హెల్త్ చెకప్ చేయించుకోవడంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80D కింద ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ. 5,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ మొత్తం సెక్షన్ 80D కింద ఇచ్చిన మొత్తం మినహాయింపు పరిమితిలోకి వస్తుంది.
పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీపై మినహాయింపు
సెక్షన్ 80TTA కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభక్త కుటుంబాలు.. బ్యాంక్, పోస్టాఫీసు, సహకార ఖాతా నుంచి వచ్చిన వడ్డీ ఆదాయంపై మినహాయింపు పొందుతారు. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 10,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.
విరాళంపై మినహాయింపు
మీరు సెక్షన్ 80G కింద నిధులను విరాళంగా అందించినట్లయితే వాటిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. మొత్తం ఆదాయంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దేవాలయాలు, మసీదులు, చర్చిల పునరుద్ధరణ కోసం చేసిన విరాళాలపై మినహాయింపు లభిస్తుంది.