Satya Nadella: ఇంత ఆర్థిక మాంద్యంలోనూ సత్య నాదెళ్ల శాలరీ ఎంత పెరిగిందో తెలుసా?
Satya Nadella Salary 2024: మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే.
Satya Nadella Salary 2024: మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే. ఆయనకు ఈ 2024 ఏడాదికిగాను 79.106 మిలియన్ డాలర్ల పారితోషికం అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల 665.15 కోట్ల రూపాయలన్నమాట. గతేడాది సత్య నాదెళ్ల ఎత్తిన వేతనంతో పోలిస్తే ఇది 63 శాతం ఇంక్రిమెంట్ అవుతుంది.
సత్య నాదెళ్ల 2014 లో మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదేళ్లలో ఆయన డ్రా చేస్తోన్న అత్యధిక మొత్తం ఇదే. ఆశ్చర్యం ఏంటంటే.. సత్య నాదెళ్ల అందుకుంటున్న పారితోషికంలో 2.5 మిలియన్ డాలర్లు మాత్రమే ఆయన శాలరీ. మిగతాదాంట్లో అధిక భాగం కంపెనీ పర్‌ఫార్మెన్స్ పెంచడంలో కీలకంగా పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే స్టాక్ అవార్డ్స్ ఉన్నాయి. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ సంస్థ సైతం పలు సైబర్ సెక్యురిటీ సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన పారితోషికాన్ని కొంతమేరకు తగ్గించాల్సిందిగా సత్య నాదెళ్ల సంస్థను కోరారు. కానీ కంపెనీ మాత్రం ఆయనకు ఇచ్చే వేతనంలో ఎలాంటి కోతలు విధించకపోగా అదనంగా 63 శాతం వేతనం పెంచింది.
2024 లో సత్య నాదెళ్ల సాధించిన విజయాలను కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ వెల్లడించింది. కోపైలట్, కోపైలట్ ప్లస్, కోపైలట్ స్టాక్‌లో సత్య నాదెళ్ల తీసుకొచ్చిన ఇన్నోవేషన్ ని కంపెనీ ప్రశంసించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ విషయంలో ఆయన నేతృత్వంలో కంపెనీ సాధించిన విజయాలను కూడా ప్రస్తావించారు.
2022 లో మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే గేమింగ్ కంపెనీని కొనుగోలు చేసింది. ఆ గేమింగ్ కంపెనీ అభివృద్ధిలోనూ సత్య నాదెళ్ల పాత్ర కీలకం అని మైక్రోసాఫ్ట్ స్పష్టంచేసింది. అక్టోబర్ 24న మైక్రోసాఫ్ట్ సంస్థ యూఎస్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఫైల్ చేసిన నివేదికల ద్వారా సత్య నాదెళ్లకు సంబంధించిన ఈ వివరాలు వెల్లడయ్యాయి.