Rooftop Solar Scheme: రూప్‌టాప్ సోలార్ స్కీమ్.. రూ.78 వేల వరకు సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?
Rooftop Solar Scheme: నేటి రోజుల్లో విద్యుత్ మరింత ఖరీదు కావడంతో బిల్లులు కట్టలేక సామాన్యులు విలవిలలాడుతున్నారు.
Rooftop Solar Scheme: నేటి రోజుల్లో విద్యుత్ మరింత ఖరీదు కావడంతో బిల్లులు కట్టలేక సామాన్యులు విలవిలలాడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిపేరు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PM-Surya Ghar: Mufti Bijli Yojna) దీనికింద 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనుంది. కానీ దీనికోసం ఇంటిపై రూప్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వీటికోసం ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఇటీవల రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ (Rooftop Solar Scheme)కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. రూప్‌టాప్ సోలార్ ప్యానెళ్ల కోసం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇందులో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
ఫిబ్రవరి 13న ప్రధాని ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్‌కు అప్లై చేసుకున్నవాళ్లు ఒక కిలోవాట్ సోలార్ ప్యానళ్లకు రూ.30వేల వరకు సబ్సిడీ పొందొచ్చు. మిగిలినది బ్యాంకు రుణం కల్పిస్తారు. రెండు కిలోవాట్‌లకు రూ.60 వేలు, మూడు అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
1. ముందుగా pmsuryaghar.gov.in పోర్టల్‌లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి.
2. మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.
3. పోర్టల్‌లో ఉన్న నియమ నిబంధలను అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
4. ఆ తర్వాత కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరుతో లాగిన్ అవ్వాలి. అక్కడ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం అప్లై చేసుకోవాలి.
5. అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి
6. ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి.
7. నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
8. ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.