కాఫీ డే సిద్ధార్థ ఆత్మహత్య పై ఎవరేమన్నారు?

Update: 2019-07-31 10:12 GMT

కాఫీ డే యజమాని సిద్ధార్థ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా అందర్నీ కలచివేస్తోంది. ఇప్పుడు సర్వత్రా అదే చర్చ సాగుతోంది. కార్పోరేట్ వ్యాపార వర్గాల్లో సిద్ధార్థ మరణం పట్ల విస్మయం వ్యక్తం అవుతుండగా.. రాజకీయంగానూ అందరూ దిగ్భ్రాంతికి గురి అయ్యారు. దేశం నలుమూలల నుంచీ సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్ని ఇవి..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి..

'వ్యాపారవేత్త, నాకు అత్యంత సన్నిహితుడైన సిద్ధార్థ హఠాన్మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నాకు 25ఏళ్లుగా తెలుసు. కర్ణాటక కాఫీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఆయన మృతితో కర్ణాటక ఓ గొప్ప వ్యాపారవేత్తను కోల్పోయింది' అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్వీట్‌ చేశారు.

బీజేపీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ విమర్శలు!

''బీజేపీ హయాంలో 'సులభతర వ్యాపారం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)' కాస్త 'సులభంగా వ్యాపారాన్ని మూసేసే(ఈజ్‌ ఆఫ్‌ ఎండింగ్‌ బిజినెస్‌)' స్థాయికి దిగజారింది. ఇందుకు సిద్ధార్థ విషాదమే ఓ ఉదాహరణ. ఇది చాలా ఆందోళనకరం' అని శశిథరూర్‌ ట్వీట్ చేశారు.

టీఅరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌..

'వి.జి. సిద్ధార్థ ఆకస్మిక మరణం విచారకరం. ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆయనో జెంటిల్‌మెన్‌. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేఫ్‌ కాఫీ డే మరింత బలంగా ఉండాలి' అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహింద్రా..

'నాకు ఆయన(సిద్ధార్థ) గురించి గానీ, ఆయన ఆర్థిక పరిస్థితుల గురించి గానీ తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే.. వ్యాపారవేత్తలు వ్యాపార వైఫల్యాల వల్ల జీవితాలను, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకూడదు. అది ఒక వ్యవస్థ మరణానికి కారణమవుతుంది' ఆనంద్‌ మహింద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..

'తన వ్యాపార చతురతతో కర్ణాటక, ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఆ సేవలు చిరస్మరణీయం. నేటి తరానికి ఓ ఉదాహరణ. ఎస్‌.ఎం కృష్ణ కుటుంబసభ్యులు, సిద్ధార్థ శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News