Indian Railways: రైలు రద్దయిందా.. టికెట్ డబ్బులు ఇలా వాపసు పొందండి..!
Indian Railways: రైలు రద్దయిందా.. టికెట్ డబ్బులు ఇలా వాపసు పొందండి..!
Indian Railways: చాలా దూరం ప్రయాణించడానికి రైల్వేలు ఉత్తమమని చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు మీరు ప్రయాణించే రైలు రద్దు కావొచ్చు. విపత్తులు, నిర్వహణ, నిరసనలు లేదా మరేదైనా కారణాల వల్ల చాలాసార్లు రైళ్లను రద్దు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఇండియన్ రైల్వే టికెట్ డబ్బులని వాపసు చెల్లిస్తుంది. దీని కోసం ప్రయాణికులు ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే రీఫండ్
మీరు ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్‌ను బుక్ చేసినట్లయితే వాపసు గురించి చింతించాల్సిన అవసరం లేదు. రైలు రద్దు అయితే టిక్కెట్‌కి సంబంధించిన డబ్బు ఆటోమేటిక్‌గా సోర్స్ ఖాతాకు వస్తుంది. దీని కోసం ఏమీ చేయవలసిన అవసరం లేదు. వారం రోజుల పనిదినాలలో రైల్వే టికెట్ డబ్బులు చెల్లిస్తుంది. మరికొన్నిసార్లు 2-3 రోజులలోనే వాపసు వస్తాయి.
కౌంటర్ నుంచి టికెట్ తీసుకుంటే..
మీరు అరైవల్ టికెట్ కౌంటర్ నుంచి రైల్వే టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఏదైనా కారణం వల్ల ఆ రైలు రద్దు అయితే టిక్కెట్ రద్దు అయినట్లుగా పరిగణిస్తారు. వాపసు కోసం మీరు TDR (టికెట్ డిపాజిట్ రసీదు) ఫైల్ చేయాలి. ఇందుకోసం IRCTC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ TDR లింక్‌కి వెళ్లడం ద్వారా PNR నంబర్, రైలు నంబర్, క్యాప్చా కోడ్‌ను సమర్పించాలి. తర్వాత ఓటీపీని నమోదు చేయాలి. అప్పుడు PNR పూర్తి వివరాలను చూస్తారు. తర్వాత వాపసు ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ స్క్రీన్‌పై మెస్సేజ్ కనిపిస్తుంది. అప్పుడు రీఫండ్ పొందాలనుకుంటున్న బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా రద్దు చేసిన రైలు టిక్కెట్ డబ్బులు తిరిగి పొందుతారు.