గత మూడు నెలలుగా పడుతూ లేస్తున్న పసిడి ధరలు..ఇప్పుడు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్గాలు తెలిపాయి. దేశీయ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరిగినా బలహీనమైన గ్లోబల్ ట్రెండ్ కారణంగా ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని అంటున్నారు. బంగారం ధరతోపాటు పెరిగే వెండి ధర ఈసారి రూ.130 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.41,530కి పడిపోయింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారాలు పేర్కొంటున్నారు.
ఇక సోమవారం పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.340 పెరిగి రూ.34,450కి చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.33,400గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,810గా ఉంది. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 34,450కి చేరుకోగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.34,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,312.2 డాలర్లకు పడిపోయింది.