Aadhar Card: ఆధార్ కార్డులో ఇన్ని రకాలున్నాయా.? ఏ కార్డుతో ఏ ఉపయోగం అంటే
Aadhar Card: ప్రస్తుతం మొత్తం 4 రకాల ఆధార్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కార్డు అనగానే ఒక ఐడీ కార్డులా ఉపయోగపడుతుందని తెలిసిందే.
Aadhar Card: సిమ్ కార్డు మొదలు ఫ్లైట్ టికెట్ వరకు ప్రతీ దానికి ఆధార్ కార్డు వినియోగం తప్పనిసరని తెలిసిందే. దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతీ చిన్న అంశానికి ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డులో పలు రకాలు ఉన్నాయన్న విషయం మనలో చాలా మందికి తెలియదు.
ప్రస్తుతం మొత్తం 4 రకాల ఆధార్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కార్డు అనగానే ఒక ఐడీ కార్డులా ఉపయోగపడుతుందని తెలిసిందే. ఆధార్ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఫోటో, మెయిల్ ఐడీ, బయోమెట్రిక్ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ నాలుగు రకాల కార్డులు జారీ చేస్తుంటుంది. ఇంతకీ నాలుగు రకాల ఆధార్ కార్డులు ఏంటి.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* మొదటిది ఆధార్ లెటర్. ఇదొక లామినేటెడ్ పేపర్. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ తరహా కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కార్డు నేరుగా వినియోగదారుడి ఇంటికి వస్తుంది. ఈ కార్డును యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి కొత్త ఆధార్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఇక రెండోది పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ కార్డు. ఇందులో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌కు ఉపయోగపడుతుంది. ఈ కార్డును యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయవచ్చు. సాధారణంగా మనం ఉపయోగించే ఫిజికల్ ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తుంది.
* మూడో రకం ఆధార్ కార్డు విషయానికొస్తే.. ఇది కాంపాక్ట్ తరహాలో ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. వ్యాలెట్‌లో సులభంగా సెట్ అయ్యేలా ఈ ఆధార్ కార్డ్ ఉంటుంది. ఇందులో కూడా క్యూఆర్ కోడ్, ఫోటో, డెమోగ్రఫిక్ వివరాలన్నీ ఉంటాయి. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఇక చివరిది నాలుగో రకం ఆధార్ కార్డ్. ఇది ఎంఆధార్ యూఐడీఏఐ జారీ చేసే ఈ కార్డు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కు పనిచేస్తుంది. ఇదొక సాఫ్ట్ కాపీ తరహా కార్డు. ఇందులో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది.